తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల పర్వం ఇప్పట్లో ముగిసేలాలేదు. ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో హైడ్రామా నడిచింది. సీనియర్ నేత వి.హనుమంతరావు గాంధీ భవన్‌కి వచ్చి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రేని కలిసి మాట్లాడుతుండగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కలుగజేసుకొని ఏదో చెప్పబోతే మద్యలో ఎందుకు దూరుతున్నావంటూ వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో ఆయన కూడా ధీటుగా బదులిచ్చారు. మాణిక్‌రావు థాక్రే ఎదుటే వారిద్దరూ వాదోపవాదాలు చేసుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి బహుశః ఆయనకి అర్దమయ్యే ఉంటుంది. ఆయన వారిని వారించే ప్రయత్నం చేశారు కానీ ఎవరూ తగ్గలేదు. చివరికి వి.హనుమంతరావు ఆగ్రహంగా బయటకు వెళ్ళిపోయారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కి రావడంతో మళ్ళీ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ నేరుగా లోనికి వెళ్ళి మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డిలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మాణిక్‌రావు థాక్రే ఫోన్ చేసి ఆహ్వానించారని గాంధీ భవన్‌కి వచ్చాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించాము. జనవరి 26 నుంచి పార్టీ కార్యక్రామాలలో పాల్గొంటాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని చెప్పాను. గాంధీ భవన్ గుమ్మం తొక్కనని నేను ఎప్పుడూ అనలేదు,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన ఉన్నంత వరకు మళ్ళీ గాంధీ భవన్ గుమ్మం తొక్కనని శపధం చేశారు. రేవంత్ రెడ్డిపై ప్రత్యక్షంగా అనేకమార్లు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన మునుగోడు ఉపఎన్నికలలో రేవంత్ రెడ్డి ఉండగా తాను ప్రచారానికి రానని తెగేసి చెప్పి విదేశాలకి వెళ్ళిపోయారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఎలాగూ గెలవరు కనుక బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గెలిపించేందుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేయాలని ఫోన్లు చేసి చెప్పారు. పార్టీకి నష్టం కలిగించేవిదంగా వ్యవహరించినందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఆయనకి షో-కాజ్ నోటీస్ కూడా పంపిస్తే దానిని చెత్తబుట్టలో పడేశానని సమాధానం చెప్పారు.
మళ్ళీ ఇంతలో ఏమయిందో గాంధీ భవన్‌కి రావడమే కాకుండా రేవంత్ రెడ్డితో సమావేశమయ్యి పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. కాంగ్రెస్ నేతలు కప్పల తక్కెడలో కప్పల్లా ఈవిదంగా నిలకడ లేకుండా వ్యవహరిస్తుండబట్టే పార్టీ నానాటికీ బలహీనపడుతోంది. మాణిక్‌రావు థాక్రే అయినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరినీ దారిలో పెట్టగలరో లేదో?