సోమేష్ కుమార్‌ బాటలో మరో 12 మంది అధికారులు ఏపీకి?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ కొన్ని రోజుల క్రితమే హైకోర్టు ఉత్తర్వుల మేరకు తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకొని ఏపీ ప్రభుత్వంలో చేరవలసివచ్చింది. ఆయనతో పాటు తెలంగాణలో ఉండిపోయిన మరో 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. 

2014లో రాష్ట్రవిభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం వారందరినీ ఏపీకి కేటాయించింది. కానీ వారందరూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి అనుకూలమైన తీర్పు పొంది నేటికీ తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మళ్ళీ పిటిషన్‌ వేసి వారందరినీ ఏపీకి పంపించవలసిందిగా కోరింది. దానిపై స్పందించిన హైకోర్టు మొదట సోమేష్ కుమార్‌ని తప్పనిసరిగా వెంటనే ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆయన ఏపీకి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయ్యారు కూడా. 

ఇప్పుడు మిగిలిన 12 మంది అధికారులు హైకోర్టులో వేర్వేరుగా వాదనలు వినిపిస్తున్నారు. కనుక ఈ నెల 27 నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలో రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని తెలియజేస్తూ ఆ రోజుకి ఈ కేసు విచారణని వాయిదా వేసింది. 

ఏపీకి వెళ్ళవలసినవారి జాబితాలో తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డిజిపిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్‌ కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనతో సహా 12 మంది అధికారులు కూడా ఏపీకి వెళ్ళిపోవలసివస్తే వారి స్థానాలలో కొత్తవారిని నియమించుకోవలసి ఉంటుంది. సోమేష్ కుమార్‌ స్థానంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఏ శాంతి కుమారిని నియమింపబడిన సంగతి తెలిసిందే.