
ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ బహిరంగసభలో సిఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు పలువరాలు ప్రకటించారు. వాటిలో ఒకటి మునేరు నదిపై కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణం. తాను హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే దానికి నిధులు కేటాయిస్తానని సిఎం కేసీఆర్ సభలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటూ ఖమ్మంలో కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 180 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో రిలీజ్ చేసింది.
ఇది కాక ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకి సిఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఖమ్మం పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు చెరో రూ.30 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు.
ఇవి కాక జిల్లాలోని పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కళ్ళాల, నెలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీలకి ఒక్కొక్క దానికీ రూ.10 కోట్లు చొప్పున, జిల్లాలోని మిగిలిన 589 గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క దానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు. ముందుగా ఖమ్మం కేబిల్ బ్రిడ్జ్ కోసం రూ.180 కోట్లు విడుదలకి సంబందించి జీవో జారీ చేశారు. త్వరలోనే మిగిలినవాటికి కూడా వరుసగా నిధులు చేస్తామని అధికారులు తెలిపారు.