17.jpg)
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతను లొంగదీసుకొనేందుకు కేసీఆర్ రూ.500 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు.
బుదవారం సాయంత్రం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు గెలుస్తుంది. వాటిలో రాయచూరు నుంచి బళ్ళారి వరకు 25-30 స్థానాలలో స్వల్ప మెజార్టీతో గెలువబోతోంది. ఆ 25-30 సీట్లలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి బిజెపికి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి రూ.500 కోట్లు ఆఫర్ చేశారు. నేను పూర్తి సాక్ష్యాధారాలతోనే ఈ ఆరోపణ చేస్తున్నాను. ఆయనతో ఫామ్‌హౌస్‌లో బేరసారాలు చేసిన మాట వాస్తవమా కదా? కేసీఆర్ చెప్పాలి,” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. సిఎం కేసీఆర్ కర్ణాటకకి తెలంగాణ ఇంటలిజన్స్ బృందాలని పంపించారని అక్కడ వారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో, ఆయా ప్రాంతాలలో పార్టీ ముఖ్యనేతల వివరాలని కూపీ లాగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే కుమారస్వామి నిన్న ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ సభకి హాజరుకాకపోయి ఉండవచ్చని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోడీతో, బిజెపితో తాను యుద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రజలని మభ్యపెడుతున్నారని, ఒకవేళ నిజంగా యుద్ధం చేస్తున్నట్లయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో మోడీ, బిజెపిలకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు ప్రచారం చేయలేదు?రాబోయే సార్వత్రిక ఎన్నికలో మళ్ళీ మోడీ, బిజెపిలని గెలిపించేందుకే కేసీఆర్ బిఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికి కర్ణాటకలో కాంగ్రెస్ నేతకి రూ.500 కోట్లు ఆఫర్ ఇవ్వడమే నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళేందుకే డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరుపలేదని, బహుశః ఫిభ్రవరిలో శాసనసభని రద్దు చేసి, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదన్నారు రేవంత్ రెడ్డి.