బిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే దేశానికి పట్టిన పీడలన్నీ వదిలించేస్తా

ఈరోజు ఖమ్మం పట్టణంలో లక్షలాది జనంతో బిఆర్ఎస్‌ నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని, అందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ప్రశంశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు అద్భుతమైన ఆలోచన అని ప్రశంశించారు. తమ రాష్ట్రాలలో కూడా తెలంగాణలో అమలవుతున్న హరితహారం, కంటివెలుగు వంటి పధకాలను అమలుచేస్తామని ప్రకటించారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చాలా అద్భుతంగా ప్రసంగించారు కానీ సభకి హాజరైనవారిలో అత్యధికులకి హిందీ అర్దం కాకపోవడం వలన ఆశించిన స్థాయిలో స్పందించలేదు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఏటా ఎర్రకోటపై ప్రధానమంత్రులు అవే ప్రసంగాలు చేస్తున్నారని కానీ దేశం మాత్రం బాగుపడలేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని బాగుచేయలేకపోయినా కనీసం ప్రసంగాలు మార్చుకొంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. 

సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “దేశ రాజకీయాలలో పెను మార్పుకి ఇక్కడి నుంచే తొలి సంకేతం పంపాము. భారత్‌ అన్ని సహజవనరులు కలిగిన సుసంపన్నమైన దేశం. కానీ అందుబాటులో ఉన్న ఆ సహజ వనరులని కూడా వినియోగించుకోలేక కోట్లాదిమంది ప్రజలు నేటికీ బాధలు అనుభవిస్తున్నారు. దేశంలో ఇన్ని నదులు, సారవంతమైన భూములు, అనుభజ్ఞులైన రైతులు ఉండగా కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులని కూడా విదేశాలని దిగుమతి చేసుకొనే దుస్థితిలో ఉన్నామని, పాలకులకి దూరదృష్టి లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. 

భారత్‌ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటినీ వదిలించేందుకే బిఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందని కేసీఆర్‌ అన్నారు. బిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్ళలో దేశమంతా విద్యుత్‌ వెలుగులతో నింపుతామని, తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, దళిత బంధు వంటి అన్ని పధకాలని దేశమంతటా అమలుచేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్‌ అందించడమే బిఆర్ఎస్‌ విధానమని కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమ్మివేస్తున్న ఎల్ఐసీ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ వగైరాలని మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి ప్రభుత్వం ఆధీనంలోనే నడిపిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పూర్వపద్దతిలో నియామకాలు చేపడతామని చెప్పారు. 150 మంది మేధావులు బిఆర్ఎస్‌ విధివిధానాలను రూపొందిస్తున్నారని అతి త్వరలోనే వాటిని ప్రకటిస్తామని కేసీఆర్‌ తెలిపారు.