మనకి సినిమాల గోల ఎందుకు... దూరంగా ఉందాం: మోడీ

సినిమాలు, రాజకీయాలకి మద్య ఏదో విదంగా సంబందం ఉంటుంది. రాజకీయ నాయకులు సినిమాలు తీయడం లేదా సినిమా నటీనటులు రాజకీయాలలో ప్రవేశించడం, సినిమాలతో రాజకీయ ప్రత్యర్దులని విమర్శించడం, రాజకీయ కక్షతో సినిమాలని అడ్డుకోవడం వంటివనేకం జరుగుతుంటాయి.

షారూఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ అనే పాటలో దీపికా పడుకొనే కాషాయరంగు బికినీ ధరించి అసభ్యంగా డ్యాన్స్ చేయడంపై పలువురు బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ నిన్నటితో ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పరోక్షంగా ప్రస్తావిస్తూ, “మనకు సంబందమే లేని సినిమాల గురించి మనలో కొందరు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి ప్రసార మాధ్యమాలలో పదేపదే ప్రసారం అవుతుండటంతో పార్టీకి తీరని అప్రదిష్ట కలగడమే కాకుండా, మన ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులు వాటితో ప్రజల దృష్టికి వెళ్ళకమునుపే కనుమరుగు అవుతున్నాయి. కనుక పార్టీలో అందరూ సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి,” అని ప్రధాని సూచించారు. 

ప్రధాని నరేంద్రమోడీ చాలా మంచి సూచనే చేశారు కానీ బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తుంటుంది కనుక సినిమాలతో సహా దానికి అందివచ్చే ప్రతీ అంశాన్ని అదే కోణంలో ఉపయోగించుకొంటూ ముందుకు సాగుతుంటుంది. కనుక బిజెపి నేతలనీ సినిమాలకి దూరంగా ఉండమని చెపితే వారు ప్రధాని నరేంద్రమోడీ సలహాని వింటారని అనుకోలేము.