బండి సంజయ్‌ కుమారుడిపై పోలీస్ కేసు నమోదు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథపై పోలీస్ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌  నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో గల మహీంద్రా యూనివర్సిటీలో బీ.టెక్ చదువుతున్న భగీరధ తోటి విద్యార్ధిని బూతులు తిడుతూ చెంపదెబ్బలు కొట్టినందుకు యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం దుండిగల్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు భగీరథపై కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనపై బండి సంజయ్‌ స్పందిస్తూ, “కేసీఆర్‌ నన్ను రాజకీయంగా ఎదుర్కొలేకనే నా కుమారుడిపై కేసు నమోదు చేయించారు. మన రాజకీయాలలోకి పిల్లలని లాగి వారి భవిష్యత్‌ చెడగొట్టొద్దనే సోయి కేసీఆర్‌కి లేదు. కాలేజీలో పిల్లలు కొట్టుకొంటారు మళ్ళీ కలిసిపోతుంటారు. అంతమాత్రన్న వారిపై పోలీస్ కేసు నమోదు చేసేస్తారా?ఇదివరకు నీ మనుమడి మీద కొందరు విమర్శలు చేసినప్పుడు పిల్లలని రాజకీయాలలోకి లాగొద్దని నేను గట్టిగా చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు చేసినదేమిటి?నా కొడుకుని నేనే తెచ్చి పోలీస్ స్టేషన్‌కి అప్పగిస్తాను. ఏం చేస్తారో చేయండి... నేనూ చూస్తాను,” అని అన్నారు. 

నిజాం నవాబు మనుమడు ఎక్కడో చనిపోతే అతని మృతదేహాన్ని హైదరాబాద్‌ రప్పించి అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం ఏమిటని బండి సంజయ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలని తన రజాకార్లతో చిత్రహింసలు పెట్టించిన నిజాం నవాబులంటే కేసీఆర్‌కి అంత భక్తి ఎందుకని ప్రశ్నించారు. 

యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాక దానిపై రోజుకి కోటి రూపాయల వరకు రాబడి వస్తోందంటూ కేసీఆర్‌ లెక్కలు చెప్పడం చూస్తుంటే యాదాద్రిని ఓ వ్యాపారకేంద్రంగా పరిగణిస్తున్నట్లు అర్దమవుతోందని బండి సంజయ్‌ అన్నారు. 

ఎన్‌కౌంటరులో హతమైన నయీమ్ డైరీ, అతను పోగేసిన ఆస్తులు, డబ్బు, బంగారం అన్నీ ఏమైపోయాయని బండి సంజయ్‌ సిఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. నయీమ్ ఆస్తులన్నిటినీ కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేసి ఉండవచ్చని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు.