శాసనసభ ఎన్నికలలో పవన్‌పై పోటీకి అలీ సై!

వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రముఖ కమెడియన్ అలీ ఈరోజు తిరుపతిలో ప్రకటించారు. ఈరోజు ఏపీ మంత్రి రోజాతో కలిసి అలీ నగరి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నప్పుడు  మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేను పవన్‌ కళ్యాణ్‌ మీద ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాను. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినీ పరిశ్రమలో మేమిద్దరం మంచి మిత్రులమే అయినప్పటికీ రాజకీయాలలో వేర్వేరు పార్టీలలో ఉన్నాము కనుక రాజకీయంగా మామద్య విభేదం సహజం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వ పాలన సాగుతోంది. కనుక ప్రజలకి కూడా ఎవరు తమకి మేలుచేస్తున్నారో బాగా తెలుసు. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవడం ఖాయం,” అని అలీ అన్నారు. 

నిజానికి పవన్‌ కళ్యాణ్‌తో ఉన్న అనుబందం కారణంగా అలీ జనసేన పార్టీలోనే చేరుతారని అందరూ భావించినప్పటికీ ఎప్పటికైనా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలనే తన కోరిక నెరవేర్చుకోవడానికి అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేయడానికి కూడా సిద్దమని చెపుతున్నారు. కానీ అలీ పవన్‌ కళ్యాణ్‌ని ఓడించగలరా?అయినా పవన్‌ కళ్యాణ్‌తో అలీ పోటీ పడి ఎవరు ఓడిపోయినా అది ఇద్దరికీ గౌరవంగా ఉండదు. కనుక అలీ ఈ ఆలోచన విరమించుకొంటే మంచిదేమో?