ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ తర్వాత మూడో స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ గెలవడం మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఓ 20 మందిని తప్పించి వారి స్థానాలలో వేరేవారిని బరిలో దింపాల్సి ఉంటుంది. ఆ 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున వారిని మార్చిన్నట్లయితే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకోగలదు. నా సర్వేలు ఎన్నడూ తప్పు కాలేదు. కనుక సిటింగ్ ఎమ్మెల్యేలలో 20 మందిని కేసీఆర్ మార్చుతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
కానీ రెండు నెలల క్రితం సిఎం కేసీఆర్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “సిట్టింగ్ ఎమ్మెల్యేలందరి పనితీరు చాలా బాగుంది. కనుక వారితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వబోతున్నాను,” అని స్పష్టంగా ప్రకటించారు. దీనిపై అప్పుడే పార్టీలో కడియం శ్రీహరివంటివారు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి సుధాకర్ కుండబద్దలు కొట్టిన్నట్లు బహిరంగంగా చెప్పేశారు. మరి ఎర్రబెల్లి సూచనపై కేసీఆర్ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.