కొండగట్టు అంజన్న గుడి వద్ద వారాహికి వాహన పూజ

మెగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీతో రాజకీయాలలో కూడా ఉన్నందున, రెండు తెలుగు రాష్ట్రాలలో తన పర్యటన కోసం అత్యాధునిక సౌకర్యాలతో ‘వారాహి’ అనే ప్రత్యేక వాహనాన్ని తయారుచేయించుకొన్నారు. మిలటరీ రంగుతో మిలటరీ వాహనంలా వారాహికి ఈ నెల 24న కొండగట్టు అంజన్నస్వామి ఆలయంలో వాహన పూజ చేయించబోతున్నారు.

ఆ తర్వాత ధర్మపురిలో తన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆ వాహనంలోనే “అనుష్టుప్ నారసింహ యాత్ర” పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలోని 32 నారసింహ క్షేత్రాలను సందర్శించనున్నారు. జనసేన పార్టీ ఈవిషయం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది.

2009 ఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నప్పుడు హైవోల్టేజ్ విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. కానీ తనని అంజన్నే కాపాడాడాని పవన్‌ కళ్యాణ్‌ నమ్ముతుంటారు. అందుకే ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించినా కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తుంటారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో టిడిపితో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారు. కనుక ముందుగా అంజన్న ఆలయంలో పూజలు చేసేందుకు రాబోతున్నారు.