తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ఓ అధికారుల బృందం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకి హాజరైంది. ఈ నెల 16 నుంచి 20వరకు ఈ సదస్సు జరుగనుంది. సదస్సు తొలిరోజునే వారు ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్) అనే ఓ సంస్థని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు.
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యాదర్శి జయేష్ రంజన్ తదితరుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్, ప్రపంచ ఆర్ధిక సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జార్గన్స్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సంస్థ లైఫ్ సైన్సస్, హెల్త్ సైన్సస్ రంగాలలో శాస్త్రీయ అధ్యయనాలు చేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో మాత్రమే ఈ సీ4ఐఆర్ అధ్యయన కేంద్రాలున్నాయి. భారత్‌లో ఏర్పాటవుతున్న తొలి అధ్యయన కేంద్రం హైదరాబాద్ నగరంలో ఏర్పాటవుతుండటం, ఆయా రంగాలలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతికి గీటురాయివంటిదాని చెప్పుకోవచ్చు. కేటీఆర్ బృందం కృషి, ప్రభుత్వం చొరవ, తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అవకాశాలు కారణంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సమయానికి కేటీఆర్ బృందం దావోస్ పర్యటన నిమిత్తం స్విట్జర్‌ల్యాండ్ చేరుకోవడం ఆ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయులతో, తెలంగాణకి చెందిన ప్రవాసుల కుటుంబాలతో వేడుకలు జరుపుకొన్నారు. భారత్ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు.