తాటికొండ-కడియం టికెట్‌ గొడవ కేసీఆర్‌ పట్టించుకోరా?

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో గత మూడున్నరేళ్ళుగా అధికార పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య కీచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ సిఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఏనాడూ వారిద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయకపోవడం నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ కోసం ఇద్దరూ పోటీ పడుతూ పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు. 

రెండు రోజుల క్రితం కడియం శ్రీహరి లింగాలఘనపురం మండలంలోని కురుమ సంఘం పాలవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనప్పుడు, “మనిషన్నవాడు నిజాయతీగా, హుందాగా వ్యవహరించాలి తప్ప తలవంచుకొనేవిదంగా ఉండరాదు. పదవుల కోసం అయ్యా... బాబూ... అంటూ ఎవరి కాళ్ళ మీద పడకూడదు. ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోవాలి. నేను రాజకీయాలలో ఆవిదంగానే ఉంటాను,” అని అన్నారు. 

గత ఎన్నికలలో రాజయ్య సిఎం కేసీఆర్‌ కాళ్ళమీద పడి టికెట్‌ సాధించుకొన్నారని, మళ్ళీ వచ్చే ఎన్నికలలో అదేవిదంగా చేస్తారని కడియం శ్రీహరి విమర్శించిన్నట్లు అర్దమవుతూనే ఉంది. ఆ వ్యాఖ్యలని రాజయ్య సరిగ్గానే అర్దం చేసుకొన్నట్లున్నారు. అందుకే వెంటనే ఘాటుగా బదులిచ్చారు. 

నిన్న హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామివారిని దర్శించుకొన్న తర్వాత రాజయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ నాదే... గెలిచేది కూడా నేనే. సిఎం కేసీఆర్‌ నన్ను మించిన విధేయుడు మరొకరు ఉండబోరు,” అని అన్నారు.