కేంద్రమంత్రులకి ప్రధాని నరేంద్ర మోడీ చిన్న షాక్ ఇచ్చారు. ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలకి ఎవరూ మొబైల్ ఫోన్స్ తో రాకూడదని ప్రధాని కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ జారీ అయ్యింది. సమావేశం జరుగుతున్నప్పుడు కొందరు మంత్రులు మొబైల్స్ లో మాట్లాడటం దానికి ఒక కారణం కాగా, మంత్రుల మొబైల్ ఫోన్లని చైనా, పాకిస్తాన్ హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు మరొక కారణమని తెలిసింది. సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత పాక్ హ్యాకర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన కొన్ని అధికారిక వెబ్ సైట్లని హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వారు మొబైల్ ఫోన్లలోకి కూడా వైరస్ జొప్పించి, వాటిని కూడా హ్యాక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తద్వారా మంత్రుల ఫోన్లని హ్యాక్ చేసి సమావేశం జరుగుతున్నప్పుడు వాటిలో ఆటోమేటిక్ రికార్డింగ్ మోడ్ ఆన్ అయ్యేలా చేసి సమావేశంలో చర్చించిన విషయాలన్నీ రికార్డింగ్ చేసి, ఆ సమాచారాన్ని హ్యాకర్ దొంగిలించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పి.ఎం.ఓ. ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల చేతనే మొబైల్స్ తీసుకుకు రావడాన్ని నిషేధించారు కనుక మంత్రులు కూడా అందుకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదు.
కానీ ఇది ఇంకా లోతుగా ఆలోచించవలసిన విషయమనిపిస్తోంది. మంత్రుల ఫోన్లని కూడా హ్యాక్ చేయగలిగితే అది దేశ భద్రతకి చాలా ముప్పు కలిగించే విషయమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే, వారు నిత్యం ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలని ఆ మొబైల్ ఫోన్ల ద్వారానే ఉన్నతాధికారులు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతుంటారు. కనుక వారి ఫోన్లు హ్యాక్ చేయడం సాద్యమైతే సమగ్ర సమాచారం పాక్ చేతిలో పడినట్లే భావించవచ్చు. అందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేసే ఉండవచ్చు. కానీ మొబైల్ ఫోన్లని హ్యాక్ చేయగలిగితే ఇక ఎంత పెద్ద రహస్యమైన బయటకి పొక్కకుండా ఆపడం చాలా కష్టమే. ఇది కేంద్రప్రభుత్వానికే కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, రక్షణ, పోలీస్, ఇస్రో తదితర అన్ని రంగాలకి కూడా వర్తిస్తుంది కనుక అందరూ తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త!