తుమ్మలకి మంత్రి హరీష్‌ రావు బుజ్జగింపు... నమ్ముతారా?

ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు గత ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కానీ 2018 ఎన్నికలలో ఓడిపోయాక సిఎం కేసీఆర్‌ ఆయనని పట్టించుకోవడం మానేశారు. దాంతో పార్టీ నేతలు కూడా ఆయనకి మొహం చాటేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ఓ స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఇది చాలా అవమానకరమే. అందుకే ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఎలాగూ గౌరవం లభించడం లేదు పైగా ఎన్నికలు దగ్గరకి వస్తున్నందున ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. 

సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఖమ్మం జిల్లాలో టిడిపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో సిఎం కేసీఆర్‌ వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 18న జిల్లాలో పర్యటించి భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కనుక ముందుగా మంత్రి హరీష్‌ రావు తదితరులని తుమ్మల నాగేశ్వరరావు వద్దకి రాయబారం పంపించారు. మంత్రి హరీష్‌ రావుతో పాటు జిల్లాకే చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా గండుగులపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు 18న ఖమ్మంలో జరిగే కేసీఆర్‌ బహిరంగసభకి రావాలని ఆహ్వానించారు. 

మూడున్నరేళ్ళుగా పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా మంత్రులను తనవద్దకి రాయబారం పంపినంతమాత్రన్న తుమ్మల నమ్ముతారనుకోలేము. రాబోయే ఎన్నికలలో టికెట్‌కి హామీ ఇస్తేనే ఆయన సభకి హాజరవవచ్చు. అయినప్పటికీ ఆయన బిజెపిలో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. బిజెపి నేతలు ఆయనతో చాలాకాలంగా టచ్‌లో ఉన్నారు. బహుశః ఈనెల 18వ తేదీనే తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్‌ షా సమక్షంలో బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.