ఒకప్పుడు సినిమాలలో మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడిన రోజా, ప్రస్తుతం ఏపీ పర్యాటకశాఖ మంత్రి అయ్యారు. ఆమె వైఎస్సార్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నందున, తమ రాజకీయ ప్రత్యర్ధిగా నిలుస్తున్న జనసేన పార్టీని దాని అధినేత పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. అయితే ఆమె ఆవిదంగా తన తమ్ముడిని అవహేళన చేస్తుండటంపై చిరంజీవి స్పందిస్తూ, “కొందరు నా తమ్ముడిని నోటికి వచ్చిన్నట్లు దూషిస్తుంటారు. మళ్ళీ నా ఇంటికి వచ్చి భోజనాలు చేసి వారి శుభకార్యక్రమాలకి ఆహ్వానిస్తుంటారు,” అని సున్నితంగా చురకలు వేశారు.
దీంతో ఆమె మరింత ఘాటుగా స్పందిస్తూ, ఈ మెగా బ్రదర్స్ ముగ్గురికీ డబ్బు సంపాదించుకొని పోగేసుకోవడమే తప్ప తమ జిల్లాకి, ప్రజలకి ఏమీ చేయరు. అందుకే వారు ముగ్గురినీ ప్రజలు ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. వీరు ముగ్గురికీ ఎటువంటి రాజకీయ భవిష్యత్ లేదు. ఉండదు,” అని అన్నారు.
మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ, “రోజా నోరు ఓ కుప్పతొట్టి లాంటిది. బుద్దున్నవారెవరూ ఆ కుప్పతొట్టిలో చెయ్యి పెట్టి ఆ కంపు అంటించుకోవాలనుకోరు. మేము ప్రజలకి ఏం చేస్తున్నామో ప్రజలకి తెలుసు. ఆమె తన పర్యాటకశాఖ గురించి ఆలోచించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏవిదంగా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తే మంచిది. పర్యాటకశాఖ మంత్రి అంటే దేశవిదేశాలు పర్యటనలు చేయడం కాదని తెలుసుకొంటే మంచిది,” అని ఘాటుగా బదులిచ్చారు.
వాల్తేర్ వీరయ్య ప్రెస్‌మీట్‌లో విలేఖరులు చిరంజీవిని రోజా కామెంట్స్ గురించి అడిగినప్పుడు, “నేను ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించను. నా స్థాయిని తగ్గించుకోవాలనుకోవడం లేదు. ఆమె మంత్రి అయిన తర్వాత మా ఇంటికి వచ్చి “సార్ సార్... అక్కఅక్కా...” అంటూ తిరిగారు. మేము ఆమెకి భోజనం పెట్టి సగౌరవంగా పంపించాము. ప్రజలకి నేను ఏం చేశానో, ఏం చేస్తున్నానో అందరికీ తెలుసు. కనుక ఆమెకి సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు,” అని సున్నితంగా సమాధానం చెప్పారు.