తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న సోమేష్ కుమార్‌ని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో 1989 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారిని సిఎం కేసీఆర్‌ నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అత్యున్నత పదవి చేపడుతున్న మహిళా అధికారిణిగా శాంతి కుమారి నిలుస్తారు. 

ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న శాంతి కుమారి ఇదివరకు ప్రభుత్వంలో వివిద శాఖలలో పనిచేశారు. గతంలో ఆమె నాలుగేళ్ళపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో చాలా కీలకపాత్ర వహించే టిఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీస్ ఛేజింగ్ సెల్‌ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్‌ మంత్రిగా పనిచేసినప్పుడు ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు సీఎస్‌గా నియమితులైన శాంతి కుమారి ఈ పదవిలో 2025, ఏప్రిల్ వరకు కొనసాగుతారు. 

ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న రామకృష్ణారావుకి ఈ పదవి చేతికి అందిన్నట్లే అంది చివరి నిమిషంలో చేజారిపోయింది. కనుక శాంతి కుమారి పదవీ విరమణ వరకు ఓపికగా ఎదురుచూడక తప్పదు.