ప్రధాని పర్యటన వాయిదా... అమిత్‌ షా పర్యటన ఖరారు!

ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటించవలసి ఉండగా అనివార్య కారణాల వలన ఆయన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని ప్రధాని కార్యాలయం తెలియజేసింది. మళ్ళీ ఎప్పుడు పర్యటించనున్నారో త్వరలోనే తెలియజేస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి సమాచారం పంపించారు. 

ప్రధాని నరేంద్రమోడీ తన తదుపరి పర్యటనలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం మద్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మద్య 85కిమీ మేర రైల్వేలైన్ దబ్లింగ్ పనులని ప్రారంభిస్తారు. ఐఐటి హైదరాబాద్‌లో పలు భవనాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారు. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన వాయిదాపడగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ అమిత్‌ షా పర్యటన ఖరారైంది. అమిత్‌ షా ఈనెల 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో బిజెపి 90 సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మిషన్-90 పేరుతో బిజెపి వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. వాటి కోసమే అమిత్‌ షా తెలంగాణ రాబోతున్నారు.