ఆ ఇద్దరు ఐఏఎస్‌లకీ ప్రగతి భవన్‌కి పిలుపు... ఇద్దరిలో ఎవరికి సిఎస్ పదవి?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని తక్షణం ఏపీకి వెళ్ళిపోవలసిందిగా హైకోర్టు ఆదేశించడంతో ఆయన స్థానంలో తక్షణం మరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. కనుక ఈ పదవికి పలువురు పేర్లు వినిపించినప్పటికీ ప్రగతి భవన్‌ నుంచి ఇద్దరికీ మాత్రమే పిలుపువచ్చింది. వారిలో ఒకరు రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికాగా మరొకరు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి. వారిదారూ ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటలకి ప్రగతి భవన్‌కి వెళ్లారు. కనుక వారిలో ఒకరికి ఈ పదవి లభించనుందని స్పష్టం అవుతోంది. 

వారిరువురిలో రామకృష్ణారావు పదవీ కాలం 2025 ఆగస్ట్ వరకు ఉండగా శాంతి కుమారి పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది. కనుక ముందుగా పదవీ విరమణ చేసే శాంతి కుమారికి అవకాశం ఇచ్చి ఆమె తర్వాత రామకృష్ణారావుని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి కుమారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మహిళకి అవకాశం కల్పించినట్లవుతుంది. మరికొద్ది సేపటిలో వారిద్దరిలో ఎవరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పదవిలో నుంచి తప్పుకొంటున్న సోమేష్ కుమార్‌ ఏపీకి వెళ్తారా లేక సుప్రీంకోర్టుకి వెళ్తారా లేక సిఎం కేసీఆర్‌ ఆయన చేత ఆ పదవికి రాజీనామా చేయించి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొంటారా? అనేది కూడా నేడో రేపో తెలుస్తుంది.