
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు కాంగ్రెస్ వార్‌రూమ్ కేసు కొత్తగా మెడకి చుట్టుకొంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ నిపుణుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ వార్‌రూమ్ నుంచే తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కించపరిచేవిదంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని రోజుల క్రితం మాదాపూర్ వద్ద గల కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోదాలు నిర్వహించి, కొన్ని కంప్యూటర్లు, విలువైన డేటా స్వాధీనం చేసుకొన్నారు. ఆ కేసులో సునీల్ కనుగోలుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇప్పుడు అదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 41ఏ కింద నోటీస్ జారీ చేసి ఈ నెల 12న విచారణకి హాజరు కావలసిందిగా కోరారు. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించి సునీల్ కనుగోలుపై కేసు నమోదు చేసినప్పుడు, మల్లు రవి వారి చర్యలను ఖండిస్తూ వచ్చే ఎన్నికలకు అవసరమైన డేటా, వ్యూహాలను అక్కడే తాము సిద్దం చేసుకొంటున్నామని తాము ఎంతో కష్టపడి సేకరించిన డేటాని సైబర్ క్రైమ్ పోలీసులు ఎత్తుకుపోవడమే కాక తిరిగి తమ ఎన్నికల వ్యూహకర్తపై కేసు మోపారని ఆరోపించారు. కాంగ్రెస్ వార్‌రూమ్ పూర్తిగా తన అధీనంలో నడుస్తోందని కనుక సునీల్ కనుగోలుని విడిచిపెట్టి తనని అరెస్ట్ చేయాలని మల్లు రవి పోలీసులకి సవాల్ విసిరారు.
అయితే పోలీసులు సునీల్ కనుగోలుని విడిచిపెట్టలేదు కానీ మల్లు రవికి కూడా నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ వార్‌రూమ్‌పై పోలీసులు దాడి చేసి తమ రికార్డులు, డేటా స్వాధీనం చేసుకొని తమ పార్టీ వ్యూహకర్తపై కేసు నమోదు చేస్తే సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ ఈ వ్యవహారంతో తమకు సంబండమే లేదన్నట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం.