హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంది. కానీ పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా నగరంలో ఎక్కడ చూసినా గోతులతో కనబడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకి ఆ గోతులు కాస్తా చిన్న చిన్న చెరువులు మారిపోవడంతో ప్రభుత్వం నగరం మధ్యలో కూడా మిషన్ కాకతీయ పధకం అమలుచేస్తోందేమోననే అనుమానాలు రేకెత్తించాయి. చివరికి రోడ్ల పరిస్థితి గురించి కూడా ప్రధాన వార్తలుగా వినిపించడం మొదలయ్యాక గానీ ప్రభుత్వం మేల్కొనలేదు. కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు ఎందుకు అంత త్వరగా పాడైపోతున్నాయని తీగ లాగితే ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల డొంక కదిలి అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. వారందరిపై కటినచర్యలు తీసుకొనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ డొంకని కదపడానికి నగర కమీషనర్ జనార్ధన్ రెడ్డి సాహసించారు.
గత ఏడాది కాలంలో రూ.337 కోట్లు ఖర్చు చేసి నగరంలో రోడ్లు నిర్మించినట్లు రికార్డులలో ఉన్నాయి. కానీ చాలా చోట్ల ఇప్పుడు ఆ రోడ్లే కనబడటం లేదు. ఆ రికార్డుల ప్రకారం ఇంటలిజన్స్ మరియు కొన్ని ఇతర ఏజన్సీల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో గుర్తించి, బాధ్యులైన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర అధికారులపై కటినమైన చర్యలు తీసుకొంటామని జనార్ధన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వాన్ని మోసగించిన కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు. ఇకపై రోడ్ల నిర్మాణ పనులని, వాటిలో నాణ్యతని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సంబంధిత రంగంలో నిపుణులతో కమిటీలని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ రాజకీయ నాయకులకి, కాంట్రాక్టర్లకి, అధికారులకి మద్య ఉన్న బలమైన బందం త్రెంచడం కమీషనర్ వల్ల సాధ్యం అవుతుందా?