ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగుసింది. ఆ వివరాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకి వివరించారు.
హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు వెలగపూడిలో నిర్మించుకొన్న సచివాలయానికి వెళ్ళిపోయారు కనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన ఆ భవనాలని తిరిగి తమకి అప్పగించమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవలసిందిగా అభ్యర్ధిస్తూ గవర్నర్ కి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మహిళా ఉద్యోగులు, ఉపాద్యాయులకి తమ పిల్లల సంరక్షణ కోసం 90 రోజులు వేతనంతో కూడిన శలవు. దీనిని వారు తమ పిల్లలకి 18 ఏళ్ళు వయసు వచ్చే వరకు కనీసం 15రోజులు చొప్పున 6సార్లు వాడుకోవచ్చు.
బాషా పండిట్లు, పి.ఈ.టి.లని స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించబడుతుంది.
నేటి నుంచి నెలరోజుల్లోగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతుల మూడవాదశ రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు. దానిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస రెడ్డి, జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు సభ్యులుగా ఉంటారు. దానిలో కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డి ప్రత్యేక అతిధులుగా వ్యవహరిస్తారు.
రాష్ట్రంలో మత్స్య సంపద, పశువుల పెంపకానికి ఉన్న అవకాశాలని అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ నేతృత్వంలో ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు.
యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు గల అవసరమైన చర్యలని సిఫార్సు చేసేందుకు మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మరొక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు.
కొత్త జిల్లాల పేర్లలో కొన్ని మార్పులు చేశారు. వాటి పేర్లు ఇక మీదట ఈవిధంగా ఉంటాయని మంత్రి తెలిపారు. యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి.