హైదరాబాద్‌లో మళ్ళీ ఐ‌టి దాడులు... ఈసారి ఎక్సెల్ కంపెనీలపై

హైదరాబాద్‌లో మళ్ళీ ఆదాయపన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. బుదవారం ఉదయం సుమారు 40 వాహనాలలో ఐ‌టి అధికారులు, వారికి రక్షణగా మూడు వాహనాలలో సీఆర్పీ జవాన్లు బయలుదేరి ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో సోదాలు నిర్వహిస్తున్నారు.

గచ్చిబౌలిలోని ఐకియా పక్కన గల ఎక్సెల్ ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని మాధాపూర్, చందానగర్, బాచుపల్లి గల దాని కార్యాలయాలు, ఆ సంస్థకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల నివాసాలపై కూడా ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలలో దాని కార్యాలయాలపై కూడా ఐ‌టి దాడులు కొనసాగుతున్నాయి. 

చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు రబ్బర్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా, ట్రేడింగ్, హెల్త్ కేర్ రంగాలలో భారీ స్థాయిలో వ్యాపార కలాపాలు సాగిస్తోంది. 

నవంబర్‌ 27,28 తేదీలలో రెండు రోజుల పాటు సుమారు 400 మంది ఐ‌టి అధికారులు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు, బంధువులు ఇళ్ళు, కాలేజీలు, కార్యాలయాలపై దాడులు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై దాడులు చేస్తున్నారు.