బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుండా, ఆ కేసుకి సంబందించిన కీలక సాక్ష్యాధారాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మీడియాకి చేరవేసినందుకుగాను, ఆ కేసు తదుపరి దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేస్తూ గతవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆ కేసులో బిజెపి ప్రతినిధులైన బిఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాసులని నిందితులుగా చేర్చుతూ సిట్ వేసిన మెమోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తుతో సిట్‌కి బృందానికి ఎటువంటి సంబందమూ లేనప్పటికీ ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హైకోర్టు కూడా ఏసీబీ కోర్టు తీర్పునే సమర్ధించి రివ్యూ పిటిషన్‌ని కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం సిట్‌ని ఏర్పాటుచేసేందుకు జారీ చేసిన జీవో నంబర్: 63ని, దాంతో బాటు సిట్‌ని, సిట్ చేసిన దర్యాప్తుని అన్నిటినీ హైకోర్టు రద్దు చేసి, ఈ కేసుని సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత సిట్ బృందం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఎందుకో అర్దం కాదు.