7.jpg)
నిధుల విడుదల సమస్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ నగరంలోని ఇందిరా పార్క్, ధర్నాచౌక్ వద్ద ధర్నా చేసేందుకు సిద్దమైంది. కానీ దానికి అనుమతి లేదంటూ పోలీసులు రేవంత్ రెడ్డిని చుట్టుముట్టి గృహ నిర్బందం చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలని కూడా పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి దీనిని తీవ్రంగా ఖండించారు.
సర్పంచుల సమస్యలకి మద్దతుగా ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయకుండా పోలీసులు ఎందుకు అడ్డుకొంటున్నారని ప్రశ్నించారు. మోడీ, బిజెపి పాలనతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ సిఎం కేసీఆర్ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దమతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మల్లు రవి ఆరోపించారు. మోడీ పాలనకి, కేసీఆర్ పాలనకి ఇక తేడా ఏముందని ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న రాష్ట్రంలో సర్పంచులకి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచి పోరాడుతుందని మల్లు రవి చెప్పారు.
ఉద్యమకారుడైన కేసీఆర్ ఇటువంటి పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రాని సాధించుకొన్నప్పుడు సర్పంచులకి అండగా కాంగ్రెస్ కేవలం ధర్నా చేస్తే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమిటి? రేవంత్ రెడ్డిని గృహ నిర్బందం చేయవలసిన అవసరం ఏమిటి? రాష్ట్రంలో ఈవిదంగా వ్యవహరిస్తూ దేశంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారంటే నమ్మశక్యంగా ఉంటుందా?