కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు తెలంగాణ సంపదే పెట్టుబడి: బిజెపి

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారో చాలాసార్లే చెప్పారు. అయితే తాను ప్రధానిగా, తన కుమారుడు ముఖ్యమంత్రిగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారని కాంగ్రెస్‌, బిజెపిలు వాదిస్తున్నాయి. అందుకోసం కేసీఆర్‌ తెలంగాణ సంపదని పెట్టుబడిగా పెడుతున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

గురువారం శామీర్‌పేటలో ‘మిషన్ 90’ పేరుతో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆయన కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“ఇదివరకు తెలంగాణ ప్రజలకు నేను ఎవరో తెలీదు. కానీ కేసీఆర్‌ నన్ను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇరికించాలని ప్రయత్నించి నా పేరు అందరికీ తెలిసేలా చేశారు. ఇందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. అయితే సీబీఐ దర్యాప్తు మొదలుపెడితే ఆ కేసులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి. ఈ కేసులో నన్ను అనవసరంగా లాగినందుకు కేసీఆర్‌ సమాధానంతో పాటు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పగలను.      

కేసీఆర్‌ ప్రాజెక్టులు, భూముల అమ్మకాల ద్వారా పోగేసిన సొమ్ముని తన జాతీయ రాజకీయాలకి పెట్టుబడిగా ఉపయోగించుకొంటున్నారు. తెలంగాణ సంపదని ఇతర రాష్ట్రాలలో పార్టీలకి పంచిపెడుతూ వాటిని తన వెంట తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఎంత సొమ్ము ముట్టజెప్పారో లెక్కలన్నీ మా దగ్గరున్నాయి. సమయం వచ్చిన్నప్పుడు అన్నిటినీ బయటపెడతాం. పాడిఆవు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కోసం పీల్చి పిప్పిచేస్తున్నారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నారు.  

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఒక్కటే మా లక్ష్యం కాదు రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేయాలని కూడా భావిస్తున్నాము,” అని అన్నారు.