జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో తన పర్యటనల కోసం, ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వలన ఏపీలో తమకు నష్టం జరుగుతుందని ఏపీలో అధికార వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతోంది. కనుక పవన్ కళ్యాణ్ ఏం చేసినా వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
వారాహి మిలటరీ వాహనాన్ని పోలి ఉండటమే కాకుండా దానికి ఇంచుమించు మిలటరీ వాహనాలకు వేసే రంగునే వేయించడంతో వైసీపీ నేతలకు నోటి నిండా పని దొరికింది. ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయనీయమని గట్టిగా వాదించారు. కానీ వారికి ఆ శ్రమ లేకుండా పవన్ కళ్యాణ్ తన వాహనాన్ని తెలంగాణ రవాణా శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించడంతో వారి నోళ్ళు మూతపడ్డాయి.
అయితే దానికి తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఏపీలో తిరగాలంటే ఏపీ రవాణాశాఖ నిబందనల ప్రకారం అన్ని సవ్యంగా ఉన్నాయో లేవో పరిశీలించిన తర్వాతే అనుమతిస్తామని వైసీపీ నేతలు చెపుతున్నారు. తెలంగాణ రవాణాశాఖ వారాహికి జాతీయ పర్మిట్ మంజూరు చేసింది. అంటే దేశంలో ఎక్కడైనా ఆ వాహనం తిరగవచ్చన్న మాట. కానీ అది ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామని ఓ మంత్రి హెచ్చరించారు. కనుక వారాహి ఏపీలో ఎప్పుడు ప్రవేశిస్తుందా అని ఏపీ వైసీపీ నేతలందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఏమాత్రం తొందరపడటం లేదు. జనవరి 2వ తేదీన ఏకాదశి రోజున కొండగట్టు అంజన్న స్వామి ఆలయం వద్ద దానికి పూజలు చేయించిన తర్వాత వీలు చూసుకొని ఏపీకి తీసుకువెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా దానికి పూజలు చేయించాలని భావిస్తున్నారు. కనుక సంక్రాంతి పండుగ తర్వాత వారాహి ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని భావించవచ్చు. అది ఏపీలో ప్రవేశిస్తే దానికి అధికార వైసీపీ నేతలు ఎన్ని అవరోధాలు సృష్టిస్తారో? వాటిని పవన్ కళ్యాణ్ ఏవిదంగా ఎదుర్కొంటారో?.