1.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మెడకి బిగుసుకొంటోంది. ఆ కేసులో నిందితులలో ఒకడైన సమీర్ మహేంద్రుపై ఈడీ కోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్‌లో కల్వకుంట్ల కవిత పేరుని కూడా పేర్కొంది. ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలను ‘సౌత్ గ్రూప్’గా ఈడీ పేర్కొంది.
వారికీ, ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వ పెద్దలకి మద్యన జరిగిన ఒప్పందం ప్రకారం, సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులని ఆమాద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌కి చెల్లించిందని ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఇందుకు ప్రతిగా ఆమాద్మీ ప్రభుత్వం కల్వకుంట్ల కవిత, మాగుంట రాఘవ్ రెడ్డి భాగస్వాములుగా ఉన్న ఇండో స్పిరిట్స్ మద్యం తయారీ కంపెనీకి భారీగా ఆర్ధిక ప్రయోజనాలు కల్పించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ బినామీల పేరుతో సౌత్ గ్రూపే నడిపించి భారీగా లాభాలు ఆర్జించింది.
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో వీరందరూ సమావేశమయ్యి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబందించి మాట్లాడుకొన్నారు. ఈ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత దీనిలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితతో సహా 36 మంది దీనికి సంబందించి సాక్ష్యాధారాలు దొరకకుండా చేసేందుకు 170 ఫోన్లు ధ్వంసం చేశారని ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
ఈ కుంభకోణం విలువ సుమారు రూ.10,000 కోట్లు వరకు ఉంటుందని ఛార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొంది. అందుకే ‘సౌత్ గ్రూప్’లో అనేక మంది ప్రముఖులు చేతులు కలిపారని, వారిలో కల్వకుంట్ల కవిత కూడా ఒకరని ఈడీ పేర్కొంది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఈ ఛార్జ్ షీట్‌ని పరిశీలించి విచారణకి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో పేర్కొన్నవారందరికీ నోటీసులు జారీ చేసి జనవరి 5వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కనుక కల్వకుంట్ల కవిత కూడా ఈ కేసు విచారణని ఎదుర్కోవలసి ఉంటుంది.
అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబందామూ లేదని ఆమె వాదిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తన తండ్రి మీద రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమపై ఐటి, ఈడీ, సీబీఐలని ఉసిగొల్పి తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తోందని కల్వకుంట్ల కవిత వాదిస్తున్నారు. కానీ ఇటీవలే సీబీఐ అధికారులు ఆమెని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే సుమారు 6 గంటలసేపు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్‌లో ఆమె పేరును కూడా చేర్చారు. కనుక ఈ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకొంటున్నట్లే కనిపిస్తోంది.