హైదరాబాద్ నగరంలో నానాటికీ వాహనాలు పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోతోంది. కనుక వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పధకంలో భాగంగా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్, ఆర్వోబీలను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. ఈ పధకం కింద మొత్తం 41 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకు 30 పూర్తయ్యాయి. ఇవి కాక రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ అధ్వర్యంలో 6 ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో 3 పూర్తయ్యాయి. మొత్తం 33 ప్రాజెక్టులలో 17 ఫ్లైఓవర్‌లు పూర్తయ్యాయి. కొత్తగూడ వద్ద నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ 18వది అవుతుంది. ఈ ఫ్లైఓవర్, దానికి అనుబందంగా నిర్మిస్తున్న అండర్ పాస్ పనులు కూడా దాదాపు పూర్తికావచ్చాయని జనవరి మొదటి వారంలో అవి ప్రారంభోత్సవానికి సిద్దం అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పధకంలో భాగంగా రూ. 250 కోట్లు భారీ బడ్జెట్‌తో కొత్తగూడ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పొడవు 3కిమీ అని తెలిపారు. దీనికి అనుబంధంగా నిర్మిస్తున్న అండర్ పాస్ పొడవు 470 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు ఉంటుందని తెలిపారు. దీనిలో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్ బాక్స్ పద్దతిలో, మిగిలిన 425 మీటర్లు ఓపెన్ బాక్స్ పద్దతిలో నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు గల ప్రాంతాలు అనుసంధానం అవుతాయి. ముఖ్యంగా కొత్తగూడ జంక్షన్, బొటానికల్ గార్డెన్, కొండాపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి 65 నుంచి 100 శాతం తగ్గుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.