
బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ నుంచి నోటీస్ అందుకొన్న తాండూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు విచారణకి డుమ్మా కొట్టారు. ఈడీ అడిగిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర పత్రాలు అన్నీ సమకూర్చుకోవడానికి సమయం సరిపోలేదని కనుక జనవరి 25వరకు తనకు సమయం ఇవ్వాలని కోరుతూ రోహిత్ రెడ్డి ఈడీకి ఓ లేఖ వ్రాశారు.
నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులలు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్లని పోలీసులకు పట్టించి జైలుకి పంపించడంలో రోహిత్ రెడ్డి కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వారిలో నందకుమార్ అనే వ్యక్తితో చివరి వరకు రోహిత్ రెడ్డే సంప్రదింపులు జరుపుతూ, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని సిఎం కేసీఆర్‌కి అందజేస్తుండేవారు. తన ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ప్రయత్నిస్తున్న వారు ముగ్గురినీ కేసీఆర్ పోలీసులు రోహిత్ రెడ్డి సాయంతో రెడ్ హ్యాండ్‌గా పట్టించి జైలుకి పంపించారు.
బహుశః అందుకు ప్రతిచర్యగా డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీతో నోటీస్ ఇప్పించి ఉండవచ్చని సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఈడీ ఉచ్చులో చిక్కుకొంటే బయటపడటం చాలా కష్టం. కనుక సిఎం కేసీఆర్ సూచన మేరకే ఈ అకౌంట్లు, పత్రాల సేకరణ పేరుతో రోహిత్ రెడ్డి ఈడీని మరింత గడువు కోరినట్లు భావించవచ్చు. కనుక ఆయన లేఖపై ఈడీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.