
తాండూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి డ్రగ్స్ కేసులో ఈరోజు ఈడీ నోటీసులు జారీ చేసి, ఇద్దరినీ ఈనెల 19న విచారణకి హాజరుకావాలని కోరింది. రెండూ డ్రగ్స్ కేసులే అయినప్పటికీ వేర్వేరు కేసులలో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.
రోహిత్ రెడ్డికి బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీస్ ఇవ్వగా, రకుల్ ప్రీత్ సింగ్‌కి 2017, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీస్ ఇచ్చింది. అయితే రోహిత్ రెడ్డికి హటాత్తుగా నోటీస్ ఇవ్వడం కాస్త ఆలోచించవలసిన విషయమే. మునుగోడు ఉపఎన్నికలకి ముందు నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయించడంలో ఆయనే ప్రధానపాత్ర పోషించారు. ఆయననే బిజెపి ప్రతినిధి నందకుమార్‌తో ఎమ్మెల్యేల తరపున బేరసారాలు చేసి ముగ్గురు బిజెపి ప్రతినిధులని నమ్మించి మొయినాబాద్‌లో గల ఆయన ఫామ్‌హౌస్‌కి రప్పించి పోలీసులకి పట్టించారు. బహుశః అందుకు ప్రతిచర్యగా డ్రగ్స్ కేసులో ఈడీ నోటీస్ వచ్చిందని భావించవచ్చు.
గత ఏడాది సెప్టెంబర్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌ని డ్రగ్స్ కేసులో ఈడీ విచారించింది. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఒక్కరికే నోటీస్ ఇస్తే రాజకీయ కక్ష సాధింపు అని బిఆర్ఎస్ నేతలు వాదించవచ్చు కనుక ఆయనతో పాటు రకుల్‌కి కూడా నోటీస్ ఇచ్చి ఉండవచ్చు.