రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులకి భద్రత కల్పించడం చూశాము. ఈ మధ్యనే జర్నలిస్టులకి కూడా ఎక్స్, వై, జెడ్ అంటూ భద్రత కల్పించడం చూశాము. ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులైన స్వామీజీలకి కూడా భద్రత కల్పించడం చూడబోతున్నాము.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించే ద్వారకాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి రాష్ట్రంలో మూడు రోజుల పర్యటించబోతున్నారు. ఆ సందర్భంగా ఆయనకి తెలంగాణా ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించబోతోంది. ఇటీవల ఆయన “షిరిడి సాయిబాబా దేవుడు కాడు...ఆయనని పూజించవద్దని” వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఆయన కార్యక్రమాలకి హాజరయ్యి నిరసనలు తెలియజేస్తున్నారు.
ఆయన అక్టోబర్ 23న సికింద్రాబాద్ లో జరుగబోయే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు. ఆ మరునాడు అంటే 24న వరంగల్, 26న వేములవాడకి వెళతారు. అక్కడి నుండి ఆయన కోల్ కతా వెళ్ళిపోతారు.
కనుక ఆయన రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఆయనకి జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రోటోకాల్ ఉపకార్యదర్శి ఎస్.అరవింద్ రాష్ట్ర డి.జి.పి.అనురాగ్ కశ్యప్ ని ఆదేశించారు.
భౌతిక సుఖాలకి, రాగద్వేషాలకి అతీతంగా మెలుగవలసిన స్వామీజీలు తామే దేవుళ్ళమన్నట్లు పాదపూజలు చేయించుకొంటారు. ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ ఆశ్రమాలలో ప్రవచనాలు చెపుతుంటారు. రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతుంటారు. అటువంటివారు తమ నోటి దురుదని ప్రదర్శించుకొని ఏదో మాట్లాడితే దానికి వారే భాద్యులు అవుతారు తప్ప ప్రభుత్వాలు కావు. సామాన్య పౌరులకి, రైతన్నలకి, మహిళలకి భద్రత కల్పించలేని ప్రభుత్వాలు అటువంటి స్వామీజీలకి ప్రజాధనంతో రక్షణ కల్పించడం అవసరమా?