ఢిల్లీ మునిసిపల్ సిబ్బంది బిఆర్ఎస్ నేతలకి చిన్న జలక్ ఇచ్చారు. సర్దార్ పటేల్ రోడ్డులో బిఆర్ఎస్ కార్యాలయం ఎదుట దేశ్ కి నేత పేరుతో కేసీఆర్ ఫోటోలతో పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్లను ఈరోజు ఉదయం తొలగించారు. అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేసినందుకు వాటిని తొలగిస్తున్నట్లు సిబ్బంది చెప్పారు.
ఈరోజు ఉదయం బిఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో సిఎం కేసీఆర్ సతీసమేతంగా ఉదయం 11 గంటల నుంచి రాజశ్యామల యాగం చేస్తున్నారు. శ్రుంగేరీ పీఠం నుంచి వచ్చిన గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మల అధ్వర్యంలో మొత్తం 12 రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ విజయవంతంగా సాగాలని కోరుకొంటూ సిఎం కేసీఆర్ ఈ యాగం నిర్వహిస్తున్నారు.
రేపు (బుదవారం) బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి పార్టీని ప్రారంభిస్తారు. తెలంగాణ నుంచి వచ్చిన మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు జరుగుతున్న యాగం, రేపు జరుగబోయే పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
బిఆర్ఎస్ ప్రారంభోత్సవం తర్వాత సిఎం కేసీఆర్ ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశమయ్యి తాను ఎందుకు బిఆర్ఎస్ ఏర్పాటు చేయవలసి వచ్చిందో, జాతీయ రాజకీయాలలో ఎందుకు ప్రవేశించాలనుకొంటున్నారో వివరించనున్నారు. ఢిల్లీలో జాతీయపార్టీల ముఖ్యనేతలతో సమావేశమై తన కార్యాచరణ గురించి వారితో చర్చించే అవకాశం ఉంది.