సిఎం కేసీఆర్‌ నేడు ఢిల్లీకి పయనం.. శనివారం వరకు అక్కడే!

సిఎం కేసీఆర్‌ నేడు సతీసమేతంగా ఢిల్లీకి బయలుదేరనున్నారు. టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చినందున ఢిల్లీలోని పటేల్ మార్గ్ లో ఉన్న బిఆర్ఎస్‌ తాత్కాలిక కేంద్ర కార్యాలయంలో ఈ నెల 14న సిఎం కేసీఆర్‌ యాగం చేయబోతున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌ ఈ యాగానికి ఏర్పాట్లు చేసేందుకు శనివారమే ఢిల్లీకి చేరుకొన్నారు. యాగం పూర్తయిన తర్వాత బిఆర్ఎస్‌ జెండా ఎగురవేసి సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో అధికారికంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు, బిఆర్ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నేటి నుంచే ఢిల్లీకి బయలుదేరుతారు. 

బిఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిఎం కేసీఆర్‌ తరపున బిఆర్ఎస్‌ ఎంపీలు పలుపార్టీల అధినేతలని ఆహ్వానించినట్లు సమాచారం. బిఆర్ఎస్‌ ఉద్ఘాటన తర్వాత సిఎం కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడవచ్చని సమాచారం. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో వసంత్ విహార్‌లో కొత్తగా నిర్మిస్తున్న బిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి అవసరమైన మార్పులు చేర్పులను సూచిస్తారు. సిఎం కేసీఆర్‌తో బాటు వాస్తు నిపుణుడు సుద్దాల అశోక్ తేజ కూడా ఢిల్లీకి వెళుతున్నారు. సిఎం కేసీఆర్‌ దంపతులు ఆదివారం రాత్రి కానీ సోమవారం ఉదయం గానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకోవచ్చు.