ఆరు గంటలపాటు కల్వకుంట్ల కవితని విచారించిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఎం కేసీఆర్‌ కుమార్తె టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని సీబీఐ అధికారులు ఆదివారం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 14లోని ఆమె నివాసంలో ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు సుదీర్గంగా ప్రశ్నించారు. 

మొత్తం ఆరుగురు సీబీఐ అధికారులు ఆమె న్యాయవాదుల సమక్షంలో ఈ కేసుకి సంబందించి ప్రశ్నించి ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్ర రెడ్డిలతో పరిచయాలు, వ్యాపారాల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం అర్దగంట సేపు భోజన విరామం ఇచ్చి మళ్ళీ విచారణ మొదలుపెట్టి సాయంత్రం 6.15 వరకు ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. విచారణ ముగిసిన తర్వాత ఈ కేసుకి సంబందించి ఆధారాలను తమకి సమర్పించాలని కోరుతూ వారు ఆమెకి సిఆర్‌పీసీ సెక్షన్ 90 కింద నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయిన్నట్లు సమాచారం. 

కల్వకుంట్ల కవితని సీబీఐ ప్రశ్నించబోతున్నట్లు ముందుగానే తెలియడంతో నిన్న ఉదయం నుంచే భారీ సంఖ్యలో బిఆర్ఎస్‌ కార్యకర్తలు ఆమె నివాసం వద్దకి చేరుకొని విచారణ పూర్తయ్యేవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కనుక ఎటువంచనీయ ఘటనలు జరుగకుండా బంజారాహిల్స్‌ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.

సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత కల్వకుంట్ల కవిత తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న బిఆర్ఎస్‌ కార్యకర్తలకి అభివాదం చేశారు. తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రగతి భవన్‌కి వెళ్ళి సిఎం కేసీఆర్‌ని కలిసి సీబీఐ విచారణ గురించి తెలియజేశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతారని భావించినప్పటికీ ఆమె మళ్ళీ తన నివాసానికి వెళ్ళిపోయారు. సీబీఐ విచారణ ముగిసిందా లేక మళ్ళీ మరోసారి ప్రశ్నించనున్నారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.