ఈరోజు టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో బిఆర్ఎస్ మిత్రపక్ష నేతలు, రైతు సంఘాల నేతల సమక్షంలో సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ జెండాని ఆవిష్కరించారు. బిఆర్ఎస్ జెండా కూడా టిఆర్ఎస్ జెండాలా గులాబీ రంగులోనే ఉన్నప్పటికీ దాని మద్యలో తెలంగాణకి బదులు భారతదేశం చిత్రపఠం ముద్రించి ఉంది. తెలుగు రాష్ట్రాల కోసం పైన తెలుగులో కిందన ఇంగ్లీషులో భారత రాష్ట్ర సమితి అని ముద్రించారు.
అనంతరం వారందరినీ ఉద్దేశ్యించి కేసీఆర్ ప్రసంగిస్తూ తమ పార్టీ వచ్చే ఏడాది జరుగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మిత్రపక్షమైన జెడిఎస్‌తో కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ పార్టీ అధినేత కుమారస్వామి మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని అందుకు బిఆర్ఎస్ అన్నివిదాల తోడ్పడుతుందని చెప్పారు. తాను స్వయంగా కర్ణాటక వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు, రైతు బంధు, మిషన్ భగీరధ వంటి పధకాల గురించి వివరించి ప్రజలను చైతన్యవంతం చేస్తానని చెప్పారు.
జాతీయస్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతూ, రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తమ బిఆర్ఎస్ పార్టీ ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ (ఈసారి రైతు ప్రభుత్వం) అనే నినాదంతో బిజెపిని ఎదుర్కొంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏవిదంగా దళిత బంధు, రైతు బంధు, మిషన్ భగీరధ వంటి పధకాలు అమలుచేస్తున్నామో కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా అమలుచేస్తామని చెప్పారు. కేవలం రెండేళ్ళలో దేశంలో మారుమూల గ్రామాలకు కూడా త్రాగు, సాగునీరు అందిస్తామని, విద్యా, వైద్య, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు.
భారతదేశంలో పుష్కలంగా సహజవనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలు, ప్రభుత్వాలు వాటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యాయని కేసీఆర్ అన్నారు. కనుక దేశంలో అందుబాటులో ఉన్న సహజవనరుల గురించి మేధావులతో చర్చించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సమర్దంగా వినియోగించుకొనేందుకు ఓ పక్కా ప్రణాళికని రూపొందిస్తామని చెప్పారు.