టిఆర్ఎస్‌ పేరు మార్పుపై రేవంత్‌ అభ్యంతరం... దేనికి?

టిఆర్ఎస్‌ పేరుని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌)గా మార్చుతూ కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆమోదం తెలుపడంతో సిఎం కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకి తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్‌ పత్రాలపై సంతకం చేసి, బిఆర్ఎస్‌ కండువా కప్పుకొని కొత్త జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు. కేసీఆర్‌ ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తారు. ఆదేరోజున బిఆర్ఎస్‌ నూతన కార్యవర్గం ఏర్పాటుకి సన్నాహాలు ప్రారంభిస్తారు. ఇప్పటికే కొంతమంది జాతీయస్థాయి నాయకులు, రైతు సంఘాల నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బిఆర్ఎస్‌లో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు వారితో చర్చించి కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. 

టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్‌గా మార్చడంపై తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. హైదరాబాద్‌లో యన మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ నేతలు ప్లీనరీ కోసం గులాబీ కూలి పేరుతో రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారస్తుల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేశారు. నేను దానిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశాను. అది ఈ నెల 12వ తేదీన విచారణకి రానుంది. అందుకే కేసీఆర్‌ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం సూచనతో కేంద్ర ఎన్నికల కమీషన్‌ హడావుడిగా టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్‌గా మార్చేసింది. కనుక నేను దీనిపై సుప్రీంకోర్టు పిటిషన్‌ వేయబోతున్నాను,” అని అన్నారు.