హైదరాబాద్‌ మెట్రోకి కేంద్రం సహకరించకపోయినా పూర్తి చేస్తాం: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులకి రాయదుర్గంలో శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌ వద్ద పోలీస్ అకాడమీ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ, “దేశంలో అత్యుత్తమ నగరాలలో హైదరాబాద్‌ మొదటిస్థానంలో నిలుస్తోంది. చారిత్రిక ప్రాధాన్యతపరంగా, అభివృద్ధి పరంగా ఏవిదంగా చూసినా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడికక్కడ చెట్లు పెంచడం వలన వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. అదొక్కటే కాదు ఇంకా అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరంలో జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్ళలో అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చేశాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. 

విశ్వనగరంగా ఎదురుగుతున్న హైదరాబాద్‌లో ప్రధాన సమస్య ట్రాఫిక్. దీని పరిష్కారం కోసం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. అయినప్పటికీ నానాటికీ వాహనాల రద్దీ పెరిగిపోతూనే ఉంది కనుక దీనికి మరో పరిష్కారంగా మెట్రోని తీసుకువచ్చాం. హైదరాబాద్‌కి అంతర్జాతీయ ప్రయాణికులు కూడా గణనీయంగా పెరిగారు. కనుక శంషాబాద్‌ విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేస్తున్నాము. ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పూర్తి బాధ్యత తీసుకొని పూర్తిచేస్తాము. దీని కోసం ఎంత ఖర్చైనా వెనకాడేది లేదు,” అని అన్నారు.