టిఆర్ఎస్‌ ఇక బిఆర్ఎస్‌... ఎన్నికల కమీషన్‌ ఆమోదం

టిఆర్ఎస్‌ అభ్యర్ధన మేరకు ఆ పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చిన్నట్లు తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈరోజు టిఆర్ఎస్‌ పార్టీకి లేఖ ద్వారా తెలియజేసింది. కనుక రేపు శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్‌ ఆవిర్భావం, బిఆర్ఎస్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలందరికీ టిఆర్ఎస్‌ కార్యాలయం నుంచి సందేశాలు పంపారు. 

గుజరాత్‌ ఎన్నికలలోగా టిఆర్ఎస్‌ పేరును బిఆర్ఎస్‌గా మార్చి ఉంటే ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించి ఉండేది. కానీ సరిగ్గా గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న ఈరోజే పార్టీ పేరు మార్పుకి కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆమోదం తెలుపుతూ లేఖ పంపడం యాదృచ్చికమా లేక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇన్ని రోజులు ఆమోదం తెలుపకుండా తొక్కిపట్టి ఉంచిందా? అనే సందేహం కలుగుతోంది.

అయితే కేసీఆర్‌ ఇప్పుడు బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు మార్గం సుగమం అయ్యింది. కానీ గుజరాత్‌లో ఎన్నికలలో బిజెపి భారీ మెజార్టీతో గెలిచి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంతో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయాల్సిఉంటుంది.