
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ ఎన్నికలకు సంబందించి సర్వే సంస్థలు ఊహించిన దాని కంటే బిజెపి మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 182 స్థానాలలో ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం బిజెపి 25 స్థానాలలో విజయం సాధించి మరో 129 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది.
ఇక సర్వే సంస్థలు ఊహించినట్లే కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచి మరో 19 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. ఆమాద్మీ పార్టీ విషయంలో కూడా సర్వేలు నిజమయ్యాయి. ఆ పార్టీ కేవలం 5 స్థానాలలో అదిక్యంలో కొనసాగుతోంది. మరో మూడు స్థానాలలో ఇతరులు అధిక్యతలో కొనసాగుతున్నారు. ఈ లెక్కన బిజెపి సుమారు 134 సీట్లు గెలుచుకొని గుజరాత్లో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బిజెపి గుజరాత్లో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టబోతోంది.
అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి సర్వే అంచనాలు తప్పాయి. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలకు ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపు ప్రకారం బిజెపి 9 స్థానాలు గెలుచుకొని మరో 19 స్థానాలలో ఆదిక్యంలో కొనసాగుతోంది. కానీ కాంగ్రెస్ పుంజుకొని 8 స్థానాలలో గెలిచి మరో 29 స్థానాలలో ఆదిక్యంలో కొనసాగుతోంది.
ఆమాద్మీ పార్టీ బిజెపి కంచుకోట గుజరాత్లో 5 స్థానాలలో ఆదిక్యం సాధించగలిగింది కానీ కాంగ్రెస్, బిజెపిల మద్య ఊగిసలాగే హిమాచల్ ప్రదేశ్లో ఒక్క స్థానంలో ఆదిక్యం సాధించలేకపోవడం విశేషం. ఇతరులు ఒక స్థానంలో గెలుపొంది మరో 2 స్థానాలలో ఆదిక్యంలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకి కనీసం 35 సీట్లు అవసరం కాగా బిజెపి 28 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలు సాధించే అవకాశాలు కనిపిస్తునందున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. కానీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బిజెపి ఎత్తుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుకొనేందుకు రహస్య ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకొంటోంది.