
బిజెపి కంచుకోట గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడే ప్రకటిస్తారు. ఈరోజు ఉదయం 7.30 గంటలకు రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. రెండు రాష్ట్రాలలో మళ్ళీ బిజెపి గెలిచి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ తెలిపాయి. కానీ గుజరాత్‌లో సర్వేలు తారుమారవుతాయని బిజెపికి గట్టిపోటీ ఇచ్చిన ఆమాద్మీ వాదిస్తోంది.
గుజరాత్‌లో 182 సీట్లు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకి 92 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 68 సీట్లకి కనీసం 35 సీట్లు గెలుచుకొన్న పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది. గుజరాత్‌లో గత ఆరు ఎన్నికలలో బిజెపియే గెలిచి రాష్ట్రాన్ని పాలిస్తోంది. ఒకవేళ ఈసారి గెలిస్తే దేశంలో 35 ఏళ్ళు ఓ రాష్ట్రాన్ని పాలించిన క్రెడిట్ బిజెపికి దగ్గుతుంది. అయితే బిజెపి పాలనతో గుజరాత్ ప్రజలు విసుగెత్తిపోయున్నారని ఈ ఎన్నికలలో మార్పు తధ్యమని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు వాదిస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బిజెపియే అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేకపోతోంది. ఈసారి హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమాద్మీ పార్టీ పోటీ చేసింది కనుక ఓట్లు చీల్చి ఇంకా అనిశ్చిత పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటలోపు రెండు రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.