నేడు సిఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 12.30 గంటలకు జగిత్యాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకొంటారు. తర్వాత టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, పట్టణంలో వైద్యకళాశాలకి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకి మళ్ళీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని దానికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడే జిల్లా అధికారులతో సమావేశమవుతారు. తర్వాత మోతె శివారులో నిర్వహించబోయే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత మళ్ళీ హెలికాఫ్టర్‌లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి తిరుగు ప్రయాణం అవుతారు.
సిఎం కేసీఆర్ జిల్లా పర్యటన, బహిరంగసభని విజయవంతం చేసేందుకు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సుమారు 2 లక్షలమందిని జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈనెల 11న సీబీఐ విచారణని ఎదుర్కొబోతున్న సిఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా జగిత్యాలకి బయలుదేరి వెళుతుండటం విశేషం. జగిత్యాల నుంచే టిఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఆమె అన్నారు.
సిఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని చెప్పినప్పటికీ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తుండటం, కేటీఆర్‌తో సహా పార్టీలో అందరూ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం ఖాయం అని మాట్లాడుతుండటం గమనిస్తే ఈసారి కూడా ముందస్తుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరునెలల్లో కేసీఆర్ ఎన్నికలకి వెళ్ళడం ఖాయమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వాదిస్తున్నారు. కనుక ఇవి ముందస్తు ఎన్నికల హడావుడే అనిపిస్తోంది.