కాంగ్రెస్ పార్టీకి రీటా టాటా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రీటా బహుగుణ జోషి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి ఈరోజు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధపెట్టాయి. వాటికీ సాక్ష్యాధారాలు కావాలని అడగడం మన సైనికులని అవమానించడమే. నేను దేశహితం కోసమే భాజపాలో చేరుతున్నాను. సోనియా గాంధీ మా మాట వినేవారు కానీ రాహుల్ గాంధీ అసలు ఎవరినీ పట్టించుకోరు. ఆయన అందరినీ కలుపుకొనిపోలేరు,” అని విమర్శించారు.

ఆమె 2007-2012 వరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ మళ్ళీ ఘోర పరాజయం పాలయింది. అప్పటి నుంచి ఆమెకి పార్టీలో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ యుపిలో చేపట్టిన కిసాన్ యాత్రలో కూడా ఆమె పాల్గొనలేదు.  

రీటా బహుగుణ పార్టీని వీడి వెళ్ళిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ లేదని ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బబ్బర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ద్రోహులు అందరూ ఒక్క చోటికే చేరుతున్నారని విమర్శించారు.