
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తులో భాగంగా సిఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ప్రశ్నించేందుకు సీబీఐ నోటీస్ పంపగా 6వ తేదీన హైదరాబాద్‌లో విచారణకు సిద్దమని జవాబు పంపారు. కానీ ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల వలన 6వ తేదీన విచారణకు హాజరుకాలేనని వచ్చే వారంలో 11 నుంచి 15వ తేదీలోగా ఎప్పుడైనా విచారణకి సిద్దమని తెలియజేస్తూ ఆమె సీబీఐకి మరో ఈమెయిల్ పంపారు.
తాను చట్టాలని, రాజ్యాంగ వ్యవస్థలని చాలా గౌరవిస్తానని, ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కనుక వచ్చే వారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విచారణకి అందుబాటులో ఉంటానని కల్వకుంట్ల కవిత సీబీఐకి ఈ-మెయిల్ లేఖ ద్వారా తెలియజేశారు.
ఈరోజు ఆమె ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో సీబీఐని ఏవిదంగా ఎదుర్కోవాలో సిఎం కేసీఆర్ ఆమెకి మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో ఆమెని నిందితురాలిగా చేర్చిన్నట్లయితే ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఏవిదంగా ఎదుర్కోవాలనే అంశంపై కూడా సిఎం కేసీఆర్ ఆమెకి మార్గదర్శనం చేయవచ్చు.
ఈ కేసు నిందితులలో ఒకరైన అమిత్ అరోరా అనే వ్యాపారిని సీబీఐ ఈ నవంబర్ 30వ తేదీన సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా సీబీఐ కోర్టుకి సమర్పిచిన రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ స్కామ్‌లో కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఇదే కేసులో ఆమెని ప్రశ్నించేందుకు సిఆర్పిసీ 160 కింద ఆమెకి నోటీస్ ఇచ్చి ప్రశ్నించాలనుకొంటోంది.