ఓ ప్రధాని ప్రభుత్వాలను కూల్చుతాననడం సమంజసనీయమేనా?

ఆదివారం మహబూబ్‌నగర్‌లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తూ, “సాక్షాత్ ప్రధాని మోడీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతాననడం సమంజసనీయమేనా? అక్కడ పశ్చిమ బెంగాల్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలన్ ఈ కూల్చడానికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి కుట్రలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించినవారిని జైలుకి పంపించి తగినవిదంగా బుద్ధి చెప్పాము. 

దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంగతి విస్మరించి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాని చూసి ఓర్వలేక మా ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలుచేస్తున్న ఈ సంక్షేమ పధకాలను చూసి మన సరిహద్దు జిల్లాలలో బిజెపి పాలిత కర్ణాటక, మహారాష్ట్రాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే ప్రస్తుతం రూ.11.50 లక్షల కోట్లు ఉన్న తెలంగాణ జీడీపీ రూ.14.50 లక్షల కోట్లకు చేరుకొని ఉండేది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నీటి పంచాయతీలని  పరిష్కరించేందుకు కేంద్రానికి  8 ఏళ్ళు సమయం సరిపోలేదా?” అంటూ కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ ఎంవీఎస్ కాలేజీకి స్టేడియం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. త్వరలోనే మక్తల్, నారాయణ పేటలో కాలువలను పూర్తి చేస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోంది. నియోజకవర్గంలో అదనంగా ఇటువంటి అదనంగా మరో 1,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకి నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు.