టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రధానసూత్రధారులలో ఒకరిగా భావిస్తున్న బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్ సిట్ గ్యాలానీకి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు సిట్ ఆయనను ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశిస్తూ ఈమెయిల్ మరియు వాట్స్ అప్ ద్వారా నోటీసు పంపిచింది.
దానిపై వెంటనే స్పందించిన ఆయన తరపు న్యాయవాది ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్‌లో బిఎల్ సంతోష్ పేరు ఎక్కడా పేర్కొనలేదని, అటువంటప్పుడు నిందితుల జాబితాలో ఏవిదంగా చేర్చి నోటీస్ పంపిస్తారని వాదించారు. ఈ కేసుతో బిఎల్ సంతోష్కి అసలు ఎటువంటి సంబందమూ లేదని కనుక ఆయనకి సిట్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు సిట్ బృందం బిఎల్ సంతోష్ జోలికి పోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ హైకోర్టు స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తే, సుప్రీంకోర్టు స్టే ఎత్తివేస్తేనే ఆయనను సిట్ ముందుకు విచారణకి రప్పించగలదు. కానీ ఇటువంటి కేసులను హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీంకోర్టు ఇదివరకే తేల్చి చెప్పింది. కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఫలితం ఉండకపోవచ్చు.