అక్రమ మైనింగ్ ద్వారా దేశ సంపదని దోచుకొని జైలుకి వెళ్ళివచ్చిన గాలి జనార్ధన రెడ్డి తన కుమార్తె బ్రాహ్మణిని హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రందేవారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డికిచ్చి చాలా అట్టహాసంగా పెళ్ళి చేయబోతున్నారు. బెంగళూరులోని మెయిన్ ప్యాలస్ మైదానంలో నవంబర్ 16వ తేదీ ఉదయం 9-10 గంటలకి అంగరంగ వైభవంగా వారి వివాహం జరుగబోతోంది. దానికి దేశంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, విదేశాల నుంచి కూడా అనేకమంది ప్రముఖులని గాలి జనార్ధన రెడ్డి ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానపత్రిక కూడా చాలా వెరైటీగా వీడియో రూపంలో ఉండటం విశేషం. అందులో గాలి జనార్ధన రెడ్డి, ఆయన భార్య అరుణ, వారి కొడుకు అందరూ కలిసి అతిధులని తమ ఇంట జరుగబోయే ఈ శుభకార్యానికి రావలసిందిగా పాటపాడుతూ ఆహ్వానిస్తారు.
11 రోజుల పాటు సాగే ఈ పెళ్ళి కార్యక్రమానికి గాలి జనార్ధన రెడ్డి సుమారు వందల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 11 రోజుల పెళ్ళి, దాని కోసం వీడియో శుభలేఖలు రూపొందించడం చూస్తే ఆ వార్తలు నిజమేనని నమ్మక తప్పదు.
ఈ వివాహ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అందరు ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక కళాకారులు హాజరవుతారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతలకి కూడా ఆహ్వానాలు అన్డుతున్నట్లు సమాచారం. దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖలు ఈ పెళ్ళికి హాజరుకాబోవడం గమనిస్తే, గాలి జనార్ధన రెడ్డి ఎంత అవినీతిపరుడైనా బాగా డబ్బున్నవాడు గనుక అతని అవినీతి గబ్బుని డబ్బుతో కడిగేసుకోగలరని స్పష్టం అవుతోంది. అతని అవినీతి గురించి గతంలో కధలు కధలుగా వర్ణించిన మీడియా కూడా ఆ పెళ్ళి ముచ్చట్ల గురించి గొప్పగా వర్ణిస్తుండటం విశేషమే. మన తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతలకి, నటీనటులకి, ప్రముఖులకి అందరికీ కూడా అతని ఘనమైన అవినీతి చరిత్ర గురించి బాగా తెలుసు. కనుక వారిలో ఎంతమంది ఈ పెళ్ళికి హాజరవుతారో చూడాలి.