కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వ్యాధి సోకింది: మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తాను మనుమడి స్కూల్ ఫంక్షన్‌ కోసం ఢిల్లీ వెళ్ళాను తప్ప బిజెపిలో చేరడానికి కాదని మొన్న గట్టిగా ఖండించారు. కానీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సుమారు అరగంటసేపు భేటీ అయ్యారు. ఆయనతో పాటు డికె అరుణ కూడా ఉన్నారు. బహుశః స్కూల్ ఫంక్షన్‌ అంటే ఇదేనేమో? బిజెపీలో చేరడం ఖాయం అయినట్లు సంకేతం ఇస్తూ, మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది. ఇక అది కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యనేతలు పార్టీని వీడి వెళ్లిపోతుంటే ఓ హోంగార్డు వెళ్ళిపోయినంత మాత్రన్న వచ్చే నష్టం ఏమీ లేదని రేవంత్‌ రెడ్డి అంటారు. అసలు మాట తీరు, వ్యవహార శైలీ రెండూ కూడా బాగోవు. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు తన సొంత డబ్బు పది కోట్లు ఖర్చు పెడతానని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. పైగా పార్టీ ఓడిపోతుందని తెలిసి ఉన్నా స్థానిక కాంగ్రెస్‌ నేతలతో డబ్బు ఖర్చు చేయించి వారినీ దివాళా తీయించేశారు. పార్టీలో డబ్బు ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని రేవంత్‌ రెడ్డి అందరినీ బెదిరిస్తుంటారు. 

రేవంత్‌ రెడ్డి తన చెంచాగాళ్ళని పెట్టి పార్టీని నడిపిస్తుండటంతో సీనియర్లు అందరూ పార్టీకి దూరమైపోయారు. నేను కూడా బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించారు. నేను ఒక్కడినే కాదు ఇక ముందు చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. అసలు రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించవద్దని మేము ఎంత మొత్తుకొన్నా కాంగ్రెస్‌ అధిష్టానం వినలేదు. ఆయన మాయలో పడి పార్టీని ఆయన చేతిలో పెట్టేసింది. దానిని ఆయన సర్వనాశనం చేసేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే. అందుకు రేవంత్‌ రెడ్డి కారకుడు అవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుస్థితి దాపురిస్తుందని, ఎప్పటికీ కాంగ్రెస్‌ మ్యాన్‌గానే ఉండాలనుకొన్న నేను పార్టీని వీడాల్సివస్తుందని కలలో కూడా అనుకోలేదు,” అని అన్నారు.