కల్వకుంట్ల కవిత ఫోన్‌ టాప్ చేసి తెలుసుకోవచ్చు కదా?ధర్మపురి

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం చేస్తుండగా రాష్ట్ర బిజెపి నేతలు కేసీఆర్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సరికొత్త యుద్ధం మొదలుపెట్టారు. కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటీవల ప్రయత్నించారంటూ నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన ఆరోపణలతో, రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య కొత్త యుద్ధం మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం టిఆర్ఎస్‌ కార్యకర్తలు బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్‌ ఇంటిపై దాడి చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“నేనేమైనా ప్రగతి భవన్‌పై దాడి చేశానా? లేక అబద్దం చెప్పానా? కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలని మల్లిఖార్జున ఖర్గేకి ఫోన్‌ చేయడం నిజం కాదా?అవునో కాదో తెలుసుకోవాలంటే కేసీఆర్‌ మా ఫోన్లు కాదు తన కూతురి ఫోన్‌ ట్యాపింగ్ చేయిస్తే నిజం బయటపడుతుంది. నేను ఇంట్లో లేని సమయంలో టిఆర్ఎస్‌ గూండాలు నా ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, పూల కుండీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలైన మా అమ్మగారు భయంతో వణికిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ముగ్గురూ చాలా కుల అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రోద్బలంతోనే టిఆర్ఎస్‌ కార్యకర్తలు నా యింటిపై దాడి చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. కవితకు ఇదే సవాల్... దమ్ముంటే నాపై పోటీ చేసి గెలిచి చూపించాలి,” అని ధర్మపురి అరవింద్‌ సవాల్ చేశారు.