
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో, దేశ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కొన్ని నెలల క్రితం శాసనసభలో “మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతాను,” అంటూ చేసిన శపదమే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
నిన్న కర్నూలులో రోడ్ షో నిర్వహించినప్పుడు ఆయన ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌరవులుగా మారి నన్ను, నా భార్యను కూడా ఎంతగానో అవమానించి గౌరవసభను కౌరవసభగా మార్చేశారు. ఆ సభను మళ్ళీ గౌరవ సభగా మారాలంటే మీరందరూ మళ్ళీ టిడిపిని నన్ను గెలిపించాలి. మీరు టిడిపిని గెలిపిస్తేనే నేను శాసనసభలో అడుగుపెట్టగలను లేకుంటే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయి. నేను రాజకీయాలలో ఉండాలన్నయ, గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ బాగుచేసుకోవాలనుకొన్నా మీరందరూ వచ్చే ఎన్నికలలో తప్పకుండా టిడిపిని గెలిపించాలి,” అని చంద్రబాబు అన్నారు.
ఆయన అభ్యర్ధనపై స్పందించిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్, “వచ్చే ఎన్నికలు ఆయన ఒక్కడికే కాదు... టిడిపికి కూడా చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఆ తర్వాత ఏపీలో ఆయన, టిడిపి కనిపించవు. అసలు ఆయన ఏపీకి ఏం చేశారని మళ్ళీ గెలిపించాలి. క్రికెట్ టీంలో కెప్టెన్‌లాగ ఉండాల్సిన చంద్రబాబు ఎగస్ట్రా ప్లేయర్‌లా మిగిలిపోయారు. కనుక ఆయన కల్లబొల్లి ఏడ్పులకు ప్రజలు కరిగిపోరు. ఆయన, మిగిలిన టిడిపి నేతలందరూ మూటాముల్లె సర్ధుకొని సిద్దంగా ఉంటే మంచిది,” అని ఎద్దేవా చేశారు.