
కొద్ది సేపటి క్రితమే జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. మహేష్ బాబు తండ్రి చితికి నిప్పు అంటించారు. సరిగ్గా రెండునెలల క్రితమే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి చనిపోయినప్పుడు ఆమెకు తలకొరివి పెట్టారు. ఇప్పుడు తండ్రికి తల కొరివి పెట్టాల్సి రావడం చాలా బాధాకరమే కానీ తప్పదు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, సిఎం జగన్‌లతో పాటు అన్ని పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా నానక్‌రామ్‌గూడాకి వచ్చి సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించారు. వారిలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఒకరు. ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కృష్ణ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడిన తర్వాత తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ట్యాంక్‌బండ్ మీద సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆయన ఆలోచన మంచిదే కానీ అది చెప్పడానికి ఆయన ఎంచుకొన్న సమయం, ప్రదేశం రెండూ సరైనవి కావని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు అందరూ కృష్ణ చనిపోయినందుకు కుటుంబ సభ్యులు బాధపడుతుంటే, అందరూ శ్రద్దాంజలి ఘటిస్తుంటే, బండి సంజయ్ రాజకీయాలు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్ నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ప్రకటించి ఉంటే ఎంతో హుందాగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది మంచి ప్రతిపాదనే కనుక తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ట్యాంక్‌బండ్ మీద కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తే మంచిదే.